పంజాబ్‌పై విజయం సాధించిన కోల్‌కతా.. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన మోర్గాన్..!

Tuesday, April 27th, 2021, 01:00:39 AM IST

ఐపీఎల్ 2021లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టుకు కోల్‌కతా బౌలర్లు చుక్కలు చూపించారు. మయాంక్ అగర్వాల్ (31), క్రిస్ జోర్డాన్ (30) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేయడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 3 వికెట్లు తీయగా, సునీల్ నరైన్, కమిన్స్‌కు చెరో 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తీ, శివం మావి తలో వికెట్ తీశారు.

అనంతరం 124 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ మోర్గాన్ కలిసి వెకెట్ పడకుండా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే రాహుల్ త్రిపాఠి (41) పరుగులు చేసి ఔటైనా, మోర్గాన్ (47 నాటౌట్) మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయానందించాడు. పంజాబ్ బౌలర్లలో హెన్‌రిక్స్, మహ్మద్ షమి, అర్షదీప్ సింగ్, దీపక్ హుడాలకు తలా ఓ వికెట్ దక్కింది. కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ దక్కింది.