పీవీ సింధుకి కారు అందించిన నాగార్జున

Saturday, September 14th, 2019, 04:30:04 PM IST

మన తెలుగు తేజం పీవీ సింధుకి దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించి మన దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది. ఆమెకి ప్రశంసలతో పాటుగా ఎన్నో బహుమతులు కూడా వస్తున్నాయి, తాజాగా ఛాముండేశ్వరినాధ్ పీవీ సింధుకి BMW కారు బహుమానంగా ఇచ్చారు. దీనికి సంబధించిన కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది.

ఈ కార్యక్రమంలో నాగార్జున చేతుల మీదగా BMW కారుని పీవీ సింధు అందుకుంది. నాగార్జున మాట్లాడుతూ, ప్రపంచ బ్యాడ్మింటన్ లో బంగారు పతాకం సాధించి మనమంతా గర్వపడేలా చేసింది సింధు. ఛాముండేశ్వరినాధ్ గారు ఇప్పటికి 22 కారులు బహుమానంగా ఇస్తే, అందులో 4 కార్లు సింధునే తీసుకోవటం విశేషం. ఆ మ్యాచ్ జరుగుతున్నా సమయంలో నేను అమెరికాలో ఉన్నాను. అక్కడ నుండే నేను మ్యాచ్ చూడటం జరిగిందని నాగార్జున చెప్పాడు.

అనంతరం సింధు మాట్లాడుతూ నాగార్జున గారు నాకు ఫెవరెట్ హీరో, ఆయన ఎవర్ గ్రీన్ హీరో, ఇక మీదట బ్యాడ్మింటన్ లో మరింత రాణించటానికి కృషి చేస్తానని తెలిపింది. టైటిల్ సాధించి ఇండియా వచ్చిన వెంటనే వరసగా ప్రముఖులను కలుస్తూనే ఉంది సింధు. మొదటిగా ప్రధాని మోదీని కలిసింది, ఆ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్, నిన్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ లను కలవటం జరిగింది.