తొలి మ్యాచ్ ఉత్కంఠ పోరులో బెంగుళూర్ విజయం.. మళ్ళీ ఓడిన ముంబై..!

Saturday, April 10th, 2021, 12:24:24 AM IST


ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభంలో భాగంగా ముంబై ఇండియన్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నై వేదికగా నేడు తొలి మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ తీసుకున్న బెంగళూరు జట్టు ముంబైని బాగానే కట్టడి చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ముంబై కేవలం 159 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఆదిలోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(19) వికెట్‌ను కోల్పోయి కష్టాల్లో పడిన ముంబై ఇండియన్స్ జట్టును ఓపెనర్ క్రిస్ లిన్ (49) ముందుండి నడిపించగా సూర్య కుమార్ యాదవ్ (31), ఇషాన్ కిషాన్ (28) రాణించారు. అయితే బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 5 వికెట్లు తీయగా కైల్ జామిసన్, సుందర్ చెరొక్క వికెట్ పడగొట్టారు.

అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు చివరి బంతి వరకు పోరాడి విజయం సాధించింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్‌లలో ఏబీ డివిలియర్స్(48) పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, గ్లెన్ మ్యాక్స్‌వెల్(39), విరాట్ కోహ్లీ(33) చక్కగా రాణించారు. అయితే ముంబై బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా, మార్కో జాన్సేన్ చెరో రెండు వికెట్లు తీయగా, ట్రెంట్ బౌల్డ్, కృనాల్ పాండ్యాలకు చెరో వికెట్ దక్కింది. ఏదేమైనా మొదటి మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధిస్తే ముంబై ఎప్పటిలాగానే తొలి మ్యాచ్‌లో ఓటమి పాలయ్యింది