అండర్-19: పాక్‌ని చిత్తు చేసి ఫైనల్స్‌లోకి అడుగుపెట్టిన భారత్..!

Tuesday, February 4th, 2020, 07:54:58 PM IST

అండర్-19 ప్రపంచకప్ నేడు భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన సెమీ ఫైనల్స్‌లో భారత్ పాకిస్థాన్‌ని చిత్తుగా ఓడించి ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. 43.1 ఓవర్లలోనే 172 పరుగులకే పాక్‌ను భారత్ ఆలౌట్ చేసింది. ఓపెనర్ హైదర్ అలీ 56 పరుగులు (77 బంతులలో) చేయగా, కెప్టెన్ నజీర్ 62 పరుగులు (102 బంతులలో), హారీస్ 21 పరుగులు (15 బంతులలో) చేయగా మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్‌లోనే పెవిలియన్ చేరుకున్నారు. అయితే భారత బౌలర్లలో ఎస్ఎస్ మిశ్రా మూడు వికెట్లు తీయగా, కార్తీక్ త్యాగి, రవి బిష్నోయ్ చెరో రెండు వికెట్లు, అంకోలేకర్, జైశ్వాల్ చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రికార్డ్ విజయాన్ని నమోదు చేసింది. పాక్ బ్యాట్స్‌మెన్స్‌కి భారత బౌలర్లు చుక్కలు చూపిస్తే, పాక్ బౌలర్లకు టీమిండియా ఓపెనర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్ జైశ్వాల్ 105 పరుగులు (113 బంతులలో) సెంచరీతో కదం తొక్కగా, మరో ఓపెనర్ సక్సేనా 59 పరుగులు (99 బంతులలో) చేశాడు. అయితే వీరిద్దరు నాటౌట్‌గా నిలవడంతో వికెట్ నష్టపోకుండా కేవలం 35.2 ఓవర్లలోనే 176 పరుగులు చేసి టీమిండియా విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో భారత్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టడంతో పాటు అండర్ 19లో తొలిసారి 10 వికెట్ల తేడాతో గెలిచిన ఘనతను కూడా సొంతం చేసుకుంది.