గుజరాత్ లోని రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. బంగ్లా జట్టు ఓపెనర్లు లిప్టన్ దాస్, మహ్మద్ నయిమ్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తరువాత సౌమ్య సర్కార్, కెప్టెన్ మహ్మదుల్లా రాణించడంతో బంగ్లాదేశ్ 153 పరుగులను చేరుకుంది. అయితే భారత బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీయగా, ఆహ్మద్, వాషిగ్టన్ సుందర్, దీపక్ చెరో వికెట్ సాధించారు.
అనంతరం 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్, ధావన్ మంచి శుభారంభాన్ని అందించారు. ఇద్దరు క్రీజ్‌లో నిలదొక్కుకుని ధాటీగా బ్యాటింగ్ చేశారు. ఇక రోహిత్ చెలరేగి ఆరు ఫోర్లు, ఆరు సిక్సులు బాది 43 బంతులలోనే 85 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ధావన్ 4 ఫోర్లతో 27 బంతులలో 31 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన లోకేశ్ రాహుల్ 8 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, శ్రేయాస్ అయ్యర్ మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 13 బంతులలోనే 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే 154 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 26 బంతులు మిగిలి ఉండగానే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి భారత్ అలవోకగా విజయం సాధించింది.