విండీస్‌ను మట్టికరిపించిన భారత్.. హిట్‌మ్యాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..!

Wednesday, December 18th, 2019, 10:14:52 PM IST

భారత్, వెస్టీండీస్ మధ్య నేడు విశాఖలో జరిగిన రెండో వన్‌డేలో భారత్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ 159 పరుగులు, కేఎల్ రాహుల్ 102 పరుగులు చేశారు, వీరిద్దరూ శతకాలతో చెలరేగడంతో తొలి వికెట్‌కు 227 పరుగుల భారీ స్కోర్‌ను చేయగలిగింది. అయితే ఆ తరువాత కోహ్లీ డకౌట్ అయినా చివరలో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ చెలరేగడంతో 387 పరుగుల భారీ లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచారు.

అయితే అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ 43.3 ఓవర్లలో 280 పరుగులకే ఆలౌటయ్యింది. షై హోప్ 78 పరుగులు, నికోలస్ పూరన్ 75 పరుగులు తప్పా ఇతర బ్యాట్స్‌మెన్స్ చేతులెత్తేశారు. చివరలో కీమో పాల్ 46 పరుగులు, పియర్ 21 పరుగులు చేయడంతో ఆ జట్టు స్కోర్ 280 పరుగులకు చేరింది. అయితే భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ హ్యాట్రిక్ వికెట్లు, షమీ మూడు వికెట్లు తీయడంతో టీమిండియా 107 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మ్యాన్ ఆప్ ది మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో మూడు వన్‌డేల సిరీస్‌లో 1-1 తో ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. అయితే చివరి వన్‌డే ఈ ఆదివారం కటక్‌లో జరగనుంది.