INDvsENG: తొలి వన్డేలో భారత్ ఘన విజయం..!

Tuesday, March 23rd, 2021, 11:01:01 PM IST


భారత్-ఇంగ్లాండ్ మధ్య నేడు పూణెలో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ వరుస వికెట్లు కోల్పోవడంతో ఏకంగా 66 పరుగుల తేడాతో భారత్ విజయకేతనం ఎగరవేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్ రోహిత్ శర్మ 28 పరుగులు చేసి తొందరగానే ఔటైనా శిఖర్ ధవన్ మాత్రం నెమ్మదిగా ఆడి 98 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ 56 పరుగులు, కేఎల్ రాహుల్ 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌తో వన్డేలో ఆరంగేట్రం చేసిన కృనాల్‌ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 31 బంతుల్లోనే 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి 317 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 3 వికెట్లు, మార్క్ ఉడ్ 2 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఆరంభం నుంచే టీమిండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఓపెనర్లు జేసన్ రాయ్(46), జానీ బెయిర్‌ స్టో(94) ఇండియా బౌలర్లను దీటుగా ఎదుర్కొని బౌండరీలతో విరుచుకుపడ్డారు. అయితే వారిద్దరూ అవుటైన తరువాత ఇంగ్లీష్ బ్యాటింగ్ లైనప్ పూర్తిగా కుప్పకూలిపోయింది. బెన్ స్టోక్స్(1), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(22), జాస్ బట్లర్(22), శామ్ బిల్లింగ్స్(18), మొయీన్ అలీ(30), శామ్ కర్రాన్(12), టామ్ కర్రాన్(11), వెనువెంటనే ఔటయ్యారు. దీంతో 42.1 ఓవర్లలో 251 పరుగులు చేసి ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యింది. ఇక భారత బౌలర్లలో అరంగేట్ర ఆటగాడు ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లతో రాణించగా, శార్దూల్ ఠాకూర్ 3, భువనేశ్వర్ 2, కృనాల్ పాండ్యా 1 వికెట్ తీసుకున్నాడు. ఈ గెలుపుతో ప్రస్తుతం భారత్ సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో ఉంది.