రసపట్టులో యాషెస్ తొలి టెస్టు

Sunday, July 14th, 2013, 12:05:48 PM IST


యాషెస్ సిరీస్ తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది.ఇంగ్లండ్‌ నిర్దేశించిన 311 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు క్లార్క్ సేన తంటాలు పడుతోంది. ఆతిథ్య జట్టు బౌలర్లను ఎదుర్కోవడంలో వీరు పూర్తిగా విఫలం కావడంతో నాలుగో రోజు శనివారం తమ రెండో ఇన్నింగ్స్‌లో 71 ఓవర్లలో ఆరు వికెట్లకు 174 పరుగులు చేసింది. విజయానికి ఆసీస్ ఇంకా 137 పరుగుల దూరంలో ఉండగా చేతిలో నాలుగు వికెట్లున్నాయి. ఓపెనర్లు షేన్ వా ట్సన్ (46), క్రిస్ రోజర్స్ (52) అందించిన శుభారంభాన్ని మిడిలార్డర్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. కోవన్ (14), క్లార్క్ (23), స్మిత్ (17), హ్యూజెస్ (0) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడంతో జట్టు కష్టాల్లో పడింది. బ్రాడ్, స్వాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.అండర్సన్, రూట్ ఒక్కో వికెట్ సాధించారు. హాడిన్ (11), అరంగేట్రం హీరో అగర్ (1) క్రీజులో ఉన్నారు. చివరి రోజు సాధ్యమైనంత మేర ప్రత్యర్థి బౌలర్లకు ఎదురొడ్డి నిలవడంపైనే ఆసీస్ విజయావకాశాలు ఆధారపడిఉన్నాయి. అంతకుముందు 326/6 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ 375 పరుగులకు ఆలౌటయ్యింది. ఇయాన్ బెల్ (109) శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.