సీఎం గారు ప్రజా సమస్యలను గాలికొదిలేసి దీక్షలకు డబ్బులు ఖర్చుపెడుతున్నారు : పవన్ కళ్యాణ్

Thursday, May 31st, 2018, 10:23:11 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ప్రజా పోరాట యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా కురూపం, పార్వతీపురం, బొబ్బిలి నియోజక వర్గాల్లో పర్యటిస్తున్నారు. కాగా నేడు అక్కడి స్థానిక ప్రజలతో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు ప్రజా సమస్యలను పూర్తిగా పట్టించుకోవడం మానేశారని, తాను ఉద్దానం కిడ్నీ సమస్యలపై గళం విప్పితే అక్కడి ప్రజలకు పూర్తిగా న్యాయం చేస్తున్నాం, అలానే వారిలో చాలామందికి నెల నెలా పెన్షన్లు ఇస్తున్నామని మోసపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నారు. మరోవైపు కురుపాం లోని పూర్ణపాడు బ్రిడ్జి నిర్మాణానికి కనీసం పదికోట్లు ఖర్చుపెట్టలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం వుంది. అదే ఒకవేళ వాళ్ళు చేపట్టే నవ నిర్మదీక్షాలకు, మహానాడులకు మాత్రం పదిహేను కోట్ల వరకు ఖర్చైనా పర్లేదు. ఇదెక్కడి న్యాయం చంద్రబాబు గారు అని ప్రశ్నించారు. ఇక నేడు పార్వతీపురం లో తాను ప్రవేశిస్తున్నపుడు ఇక్కడి రోడ్ల దుస్థితి చూసి తనకు బాధ కలిగిందని, అలానే ఇక్కడ చేపట్టిన వంతెన నిర్మాణం సగంలోనే ఆపేశారని, అది ప్రస్తుతం పైకెక్కి కిందన ఎవరు వెళ్తున్నారా అని సరదాగా చూడడానికి మాత్రమే ఉపయోగపడుతోంది ఎద్దేవా చేశారు.

ముఖ్యంగా ఇక్కడి ప్రజలు పడుతున్న తాగునీటి అవసరాలను తాను తెలుసుకున్నానని, స్థానికులు తనవద్దకు తీసుకొచ్చి చూపించిన నీరును బట్టి చూస్తే ఒకవేళ ఇవే కనుక రోజూ తాగుతూ ఉంటే కలరా, డయేరియా వంటి వ్యాధులు ప్రభలడం ఖాయమని, ఇక్కడి ప్రజలు నీటి విషయంలో ఇంతటి బాధలు పడుతుంటే ఎమ్యెల్యేలు, మంత్రులు ఏమి చేస్తున్నారని మండిపడ్డారు. అంతే కాదు చంద్రబాబు ప్రభుత్వం గత ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి తాను చాలా సాయం చేసానని, అందుకే ఇకపై రానున్న వై ఎన్నికల్లో టీడీపీకి వోటెయ్యొద్దని తానే చెపుతున్నాని అన్నారు. రానున్న ఆగష్టు నెలలో తమ పార్టీ మేనిఫెస్టోలో దిగువ, మధ్యతరగతి ప్రజల కష్టాలు తీర్చే అంశాలే ఎక్కువగా వుంటాయని, మానిఫెస్టో రూపకల్పన తరువాత తాను మళ్ళి ఇక్కడకు వచ్చి ప్రజలతో కలిసి మాట్లాడతాను అన్నారు.

ప్రస్తుతం తాను చేస్తున్న ఈ యాత్రలో ఒక్కొక్క ఊరిలో ప్రజలు పడుతున్న అవస్థలు తలుచుకుంటుంటే గుండె తరుక్కుపోతోందని, నాయకులు ఇలా అన్నీతెలిసి ఎలా చూస్తూ ఊ ఊరుకుంటున్నారని అన్నారు. కేంద్రం నుండి వస్తున్న నిధులన్నీ, అమరావతికేనా, ఇక మిగిలిన ప్రాంతాల అభివృద్ధి అవసరంలేదా బాబుగారు అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కొన్ని చోట్ల దివ్యాంగులు సైతం తమకు పెన్షన్ అందడం లేదని అన్నారని చెప్పారు. పెన్షన్ కోసం లంచాలు అడుగుతున్నవారిని ప్రభుత్వమే అడ్డుకుని దివ్యాంగ సోదరులకు పెన్షన్ నిరంతరం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. చూసాం, చూసాం, భరించాం ఇక మా వల్ల కాదు, మీ పార్టీపై నేతలపై ప్రజలు తిరగపడే సమయం దగ్గరకు రానే వచ్చిందని, రానున్న ఎన్నికల్లో అవకాశం వున్న మేరకు దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో తాము పోటీ చేసి తీరుతామని అన్నారు…….

  •  
  •  
  •  
  •  

Comments