సిద్ధమవుతున్న నివేదికలు.. మొదలైన కసరత్తులు..

Thursday, October 17th, 2013, 02:30:47 AM IST


రాష్ట్ర విభజనకు సంబంధించిన నివేదికలు సిద్ధం అవుతున్నాయి. కేంద్రం వేసిన గ్రాప్ ఆఫ్ మినిష్టర్స్ కమిటీ పని ప్రారంభించింది. ఇప్పటికే కీలక అంశాలకు సంబధించిన నివేదికలను రాష్ట్రాన్ని కోరిన నేపద్యంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి పీకే మహాంతి 11 అంశాలతో కూడిన నివేదికలు పంపినట్టు సమాచారం. ఇప్పటివరకూ ఆయా శాఖల్లో జరిగిన కేటాయింపులు, ఖర్చులు, ఆదాయాలకు సంబంధించిన వివరాలు నివేదికలో ఉన్నట్టు తెలుస్తుంది. 19న కేంద్ర బృందం భేటి నేపథ్యంలో నివేదికల అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.

రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ సీమాంధ్రలో ఎన్ని ఉద్యమాలు, ఆందోళనలు జరుగుతున్నా కేంద్రం మాత్రం పెడచెవిన పెట్టినట్టు కన్పిస్తుంది. తమ నిర్ణయాన్ని యదా ప్రకారంగా అమలుకు సిద్ధం అయినట్టు సమాచారం. అయితే కేంద్ర మంత్రి వర్గం రాష్ట్రానికి వచ్చి నివేదికలు సేకరిస్తుందని ముందుగా ప్రచారం జరిగినా.. అలాంటిది ఏమి లేకుండానే నివేదికలతో పని కానించేయాలని భావిస్తుంది. శ్రీకృష్ణకమిటి నివేదికలు పరిశీలించిన జీవోఎం తాజాగా రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు కోరింది. రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు కూడా ఢిల్లీకి చేరటంతో శ్రీకృష్ణకమిటి నివేదికలు ప్రస్తుత ప్రభుత్వ నివేదికలు సమన్వయం చేసుకుని 19న జరిగే సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివరాలతో పాటు కీలక శాఖలకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించినట్టు తెలుస్తుంది.

కీలక అంశాలతో కూడిన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్రానికి పంపారు. అయితే ఇటువంటి నివేదికలు ఇప్పటికే శ్రీకృష్ణకమిటి వద్ద సిద్ధంగా ఉన్నప్పటికీ తాజా వివరాలు కూడా నివేదికతో క్రోడికరించనున్నట్టు సమాచారం. మొత్తానికి కేంద్రానికి రాష్ట్ర నివేదకలు పంపటంతో తెలంగాణ ప్రక్రియ వేగవంతం అవుతుందని తెలంగాణావాదులు సంతోషపడుతుండగా.. సీమాంధ్ర నేతలు టెన్షన్ లో ఉన్నారు.

కేంద్రం తెలంగాణాపై దూకుడుగా వ్యవహరిస్తున్న తీరుకు అనుగుణంగానే..రాష్ట్ర, కేంద్ర మంత్రులు చక్రం తిప్పుతున్నారు. నిన్నామొన్నటి వరకూ సమైక్యాంధ్రే తమ లక్ష్యం అని ప్రగల్బాలు పలికిన నేతలు తాజాగా సీమాంధ్ర ప్రజల హక్కులు రక్షించే బాధ్యత తమదే అని బిల్డప్ ఇస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ లో రక్షణతో పాటు హక్కులు కూడా సీమాంధ్రులకు కల్పించాలని కోరతామని చెపుతున్నారు. తాను సమైక్యవాదినేనని, రాష్ట్ర విభజన అనివార్యమైతే వికేంద్రీకరణ చేసి, అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారని కేంద్ర మంత్రి పురంధేశ్వరి పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజల హక్కులను కాపాడుతామని ఆమె అన్నారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ.. తాము పదవిలో ఉంటేనే సీమాంధ్రలో సమస్య తీవ్రతను కేంద్రానికి వినిపించవచ్చునని అన్నారు. సీమాంధ్రకు కావాల్సిన వనరులు.. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో, దానికి సంబంధించిన అన్ని విషయాలు జీవోఎం కు తెలియజేస్తామని పురంధేశ్వరి అంటున్నారు.

మరో మంత్రి పనబాక సైతం అదే విషయాన్ని చెపుతున్నారు. విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందాన్ని సీమాంధ్ర కేంద్ర మంత్రులందరం కలుస్తామని పనబాక లక్ష్మీ తెలిపారు. విద్య, ఉపాధి, సాగునీరు, విద్యుత్ వంటి సమస్యలపై జీవోఎంతో చర్చిస్తామని చెప్పుకోచ్చారు. తాజాగా పళ్ళం రాజు సైతం హైదరాబాద్ లో సీమాంధ్రుల హక్కులు కాపాడే బాధ్యత మాదే అని తెలిపారు.

సీమాంధ్ర ఉద్యమాలు, ఆందోళనలు, సీమాంధ్ర మంత్రులు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్దనలను కేంద్రం ఏమాత్రం పట్టించుకున్నట్టు కన్పించటంలేదు. అంతే కాకుండా తెలంగాణ ప్రక్రియనే వేగవంతం చేసే పనిలో ఉంది. అయితే ఇప్పటివరకూ దూకుడుగా వ్యవహరిస్తున్న సీఎం కిరణ్…ఇప్పడు ఏం చేస్తారా అనే మీమాంశ అందరిలోనూ నెలకొంది.